న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్‌లో కాకుండా సంప్రదాయ బగ్గీలో రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి బగ్గీని వినియోగించడం 40 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ బండి వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది.
బ్రిటిష్ పాలనా కాలంలో భారత దేశ వైస్రాయ్ దీనిని ఉపయోగించేవారు. అప్పటి వైస్రాయ్ ఎస్టేట్ (ప్రస్తుత ప్రెసిడెన్షియల్ ఎస్టేట్)లో ఈ బండిలో విహరించేవారు. బ్రిటిష్ పాలన అంతమై, భారత్, పాకిస్థాన్ వేర్వేరు దేశాలుగా ఏర్పాటైనపుడు ఈ విలాసవంతమైన బండి కోసం పోటీ జరిగింది. దీనిని దక్కించుకోవడానికి భారత్, పాక్ ప్రయత్నించాయి. చివరికి ఓ నాణేన్ని ఎగురవేసి, అదృష్టం ఎవరిని వరిస్తే వారిదే ఈ బగ్గీ అనే రాజీ మార్గానికి వచ్చారు. భారత దేశ కర్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్, పాకిస్థాన్ కర్నల్ సాహబ్జాదా యాకూబ్ ఖాన్ నాణేన్ని ఎగురవేశారు. అదృష్టం భారత్‌ను వరించింది. దీంతో ఈ బండి భారత్‌కు లభించింది.