ముంబై, మే 30( నమస్తే తెలంగాణ): నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో చేరనున్న మొదటి బ్యాచ్ మహిళల స్నాతకోత్సవ కార్యక్రమం శుక్రవారం పుణె ఖడక్ వాసలలోని ఎన్డీఏలోని ఖేత్రపాల్ మైదానంలో ఉత్సాహంగా జరిగింది. ఈ స్నాతకోత్సవం ప్రత్యేకమైనది. ఎందుకంటే 75 ఏండ్లలో తొలిసారిగా ఎన్డీఏలో మహిళలు శిక్షణ పూర్తి చేసుకుని సైన్యంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిజోరం గవర్నర్, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్, ఆర్మీ సదరన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో గవర్నర్ వీకే సింగ్ మాట్లాడుతూ, మొదటిసారిగా మహిళలు ఇకడ శిక్షణ పూర్తి చేసుకోవడం దేశానికి గర్వకారణమని, వారి అంకితభావం, క్రమశిక్షణకు దేశం గర్విస్తున్నదని అన్నారు.