కొత్తగూడెం ప్రగతి మైదాన్, సెప్టెంబర్ 24 : పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో 71 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయారు. వివరాలను దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ బుధవారం వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 21 మంది మహిళా సభ్యులు ఉన్నారు. 30 మంది పై రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 1,113 మంది మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యలు లొంగిపోగా.. వారిలో 297 మం దిపై రివార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు.
భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జార్ఖండ్ రాష్ట్రం గుల్మా జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గుల్మా జిల్లాలోని కేచ్కీ అటవీ ప్రాంతంలో జాగ్వార్, గుల్మా పోలీసులు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతులు జార్ఖండ్ జన్ముక్తి పరిషత్ (జేజేఎంపీ)కి చెందిన సభ్యులు లాలు లోహ్రా, సుజిత్ ఓరాన్ (లోహర్గడ జిల్లా), చోటూ ఓరన్ (లాతేహర్ జిల్లా)లుగా పోలీసులు గుర్తించారు.