Divorce | హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 70 ఏండ్ల సుభాష్ చంద్ అనే రైతు తన 40 ఏండ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. 1980లో సంతోష్ కుమారి అనే యువతితో సుభాష్ చంద్ వివాహం జరిగింది. కానీ, భార్యాభర్తల మధ్య వ్యక్తిగత విభేదాల వల్ల 2006 నుంచి విడిగా జీవిస్తున్నారు. 2006 నుంచి 18 ఏండ్ల పాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత రూ.3.1 కోట్లతో మధ్యవర్తిత్వ ఒప్పందం చేసుకున్నారు. 2006 లో మానసిక వేధింపుల కారణంగా విడాకులు కావాలని సుభాష్ చంద్ పిటిషన్ దాఖలు చేశాడు. 2013లో కర్నాట్ కుటుంబ న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
కానీ ఆయన పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ 11 ఏండ్ల పాటు విచారణ జరిగిన తర్వాత గత నెల నాలుగో తేదీన మధ్యవర్తిత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ.2.16 కోట్ల విలువైన డిమాండ్ డ్రాఫ్ట్, పంటల విక్రయం ద్వారా రూ.50 లక్షలు, రూ.40 లక్షల విలువైన బంగారం – వెండి ఆభరణాల అప్పగింతతో ఇరువురి మధ్య మధ్యవర్తిత్వ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సుభాష్ చాంద్ ఆస్తులపై ఆయన మరణం తర్వాత కూడా ఆయన ఆస్తులపై భార్యా పిల్లలకు హక్కు ఉండదు. ఈ మధ్యవర్తిత్వ ఒప్పందానికి జస్టిస్‌లు సుధీర్ సింగ్, జస్జిత్ సింగ్ బేడీలతో కూడిన ధర్మాసనం ఆమోద ముద్ర వేసింది.