లక్నో: ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. నిర్మాణంలో ఉన్న మాల్ బేస్మెంట్లో బాలిక మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు పోస్ట్‌మార్టంలో నిర్ధారణ అయ్యింది. కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. (Girl Raped And Killed) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. నందగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఒక పెద్ద షాపింగ్ మాల్ నిర్మిస్తున్నారు. కూలీ పనులు చేస్తున్న ఒక కుటుంబం అక్కడ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గుడిసెలో నివసిస్తున్నారు.
కాగా, శుక్రవారం రాత్రి వేళ ఆ కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలిక అదృశ్యమైంది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆ చిన్నారి కోసం అక్కడ వెతికారు. శనివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో నిర్మాణంలో ఉన్న మాల్ బేస్మెంట్ ఏరియాలో బాలిక మృతదేహం కనిపించింది. ఆగ్రహం చెందిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడి సెక్యూరిటీ గార్డ్‌పై దాడి చేశారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. హత్యకు ముందు ఆ బాలికపై అత్యాచారం జరిగిందని, తలకు తగిలిన గాయం కారణంగా ఆమె మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో నిర్ధారణ అయింది.
అయితే అత్యాచారం తర్వాత ఆ బాలికను మూడో అంతస్తు నుంచి కిందకు పడేయడంతో తలకు గాయంతో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో అత్యాచారం, హత్య, కిడ్నాప్‌తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో ఇద్దరు అనుమానితులు పరారీలో ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.