Boy fell into well | బోరు బావుల్లో చిన్నారులు పడిపోవడం మనం చాలా చూస్తుంటాం. బోరుబావుల్లో నుంచి పిల్లల్ని బయటకు తీయడం తలకు మించిన భారంగా తయారవుతున్నది. అయితే, రెస్క్యూ సిబ్బంది ధైర్య సాహసాల కారణంగా కొందరు బతికి బయటపడుతుంటారు. అచ్చం ఇలాంటి సీన్ ఒకటి మధ్యప్రదేశ్‌లో జరగ్గా.. ఇంటి యజమాని పిల్లాడిని బావి నుంచి 5 నిమిషాల్లోనే చాకచక్యంగా బయటకు తీసి శహబాష్ అనిపించుకున్నాడు.
వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్‌లోని దామోహాలో ఇంటి ముందు ఇద్దరు చిన్నారులు అర్నవ్, సన్యామ్లు ఆడుకుంటున్నారు. ఇంతలో అక్కడే ఉన్న ఎత్తైన ప్రదేశంపైకి ఎక్కిన అర్నవ్ కాలు జారడంతో పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. పడగానే పిల్లాడు అరుస్తూ ఏడుస్తున్నాడు. విషయం గమనించిన కుటుంబసభ్యులు బావి దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. ఇంటి యజమాని పవన్ జైన్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పిల్లాడి అరుపులను గమనిస్తూ బావిలోని పైపులను పట్టుకోవాలని సలహా ఇచ్చాడు. తాడు సాయంతో బావిలోకి దిగాడు. తాడును పిల్లాడికి కట్టి పైకి పంపి ఆ తర్వాత తానూ పైకొచ్చాడు. దాంతో పిల్లాడు క్షేమంగా బయటపడ్డాడు.
ఆడుకుంటున్న సమయంలో బావి గట్టుపై నడుస్తూ వెళ్తండగా మెష్ విరిగిపోవడంతో బావిలో పడిపోయానని అర్నవ్ చెప్పాడు. ఆ తర్వాత ఏడుస్తూ అరవడంతో పవన్ అన్న వచ్చి కాపాడారని బాలుడు తెలిపాడు. మెష్ విరిగిపోతుందని తనకు తెలిసి ఉంటే అటువైపు అడుగులు వేయకుండా ఉండేవాడినని భయంగా చెప్పాడు. ఎంతో ధైర్యంతో బావిలోకి దూకి ఏడేండ్ల పిల్లాడ్ని కాపాడిన పవన్ జైన్‌ను గ్రామస్థులు అభినందించారు. బాలుడు పడిపోయిన బావి దాదాపు 28 ఫీట్ల లోతుగా నీటితో నిండి ఉన్నది.