న్యూఢిల్లీ: ఆహార నియమాలు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా ఎంతకూ రక్తంలో చక్కెర స్థాయి అదుపులోకి రావడం లేదా? అయితే దీనికి కారణం మీకు సరైన నిద్రలేకపోవడం కూడా కారణం అయి ఉండవచ్చునంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజూ కచ్చితంగా ఏడు గంటల పాటు మంచిగా నిద్రపోతే మీ చక్కెర లెవెల్స్ సాధారణ స్థాయికి చేరుకుంటాయని అంటున్నారు. 36 ఏండ్ల క్రియేటివ్ డైరెక్టర్ ఒకరికి హెచ్‌బీఏ1సీ (రక్తం లోని చక్కెర స్థాయి మూడు నెలల సగటు) లెవెల్స్ 6.5 దగ్గరే ఉంటున్నది.
తాను ఎంతో కఠినంగా ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తున్నా ఎందుకు తగ్గడం లేదని బాధపడుతున్న ఆయన ఇటీవల పరిశోధకులు ఇచ్చిన సలహాను ఆచరణలో పెట్టి చూశారు. రోజుకు కచ్చితంగా ఏడు గంటల పాటు నిద్రపోవాలని వారు ఇచ్చిన సలహాను తుచ తప్పకుండా అమలు చేసి చూడగా, చిత్రంగా మూడు నెలల తర్వాత ఆయన హెచ్‌బీఏ1సీ లెవెల్స్ 5.7 శాతంతో సాధారణ స్థాయికి చేరుకుంది.
నిద్రలేమి వల్ల గ్లూకోజ్ జీవక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, హార్మోన్ నియంత్రణ దెబ్బ తింటాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దోహదం చేస్తాయి. దీనికి విరుద్ధంగా తగినంత, స్థిరమైన నిద్ర పోతే అది గ్లూకోజ్‌ను నియంత్రించడమే కాక, కణజాలంను మరమ్మతు చేయడానికి, జీవక్రియ సమతుల్యతను కాపాడటానికి, శరీర సహజ సామర్థ్ధ్యాన్ని చూపడానికి దోహదం చేస్తుంది. స్థిరమైన నిద్ర మన శరీరంలోని ఇన్సులిన్‌ను సమర్థంగా వినియోగించడానికి దోహదపడుతుంది. దీంతో కణాలు గ్లూకోజ్‌ను శోషించి బ్లడ్ సుగర్ స్థాయిని స్థిరంగా ఉంచుతాయి.