Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లోని ఒక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రసాదం తిన్న భక్తుల్లో 62 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన యూపీలోని కన్నౌజ్ జిల్లా, సిమౌపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిమౌపూర్ గ్రామానికి చెందిన మున్నాలాల్ కశ్యప్ అనే వ్యక్తి తన ఇంటిలో శుక్రవారం సాయంత్రం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా బంధువులు, సన్నిహితుల్ని ఆహ్వానించారు. కార్యక్రమం అనంతరం అందరికీ భోజన ప్రసాదం అందించారు. అయితే, ఈ ప్రసాదం తిన్న తర్వాత భక్తులకు కొన్ని గంటల్లోనే కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటివి మొదలయ్యాయి. రాత్రిపూట బలహీనంగా తయారయ్యారు. దీంతో వారి బంధువులు, కుటుంబ సభ్యులు ముందుగా ప్రథమ చికిత్స కోసం స్థానిక ప్రైవేటు క్లినిక్లకు తీసుకెళ్లారు. అయితే, ఇలాంటి లక్షణాలే ఎక్కువ మందికి కనిపించడం, కొందరి అనారోగ్య పరిస్థితి మరీ విషమించడంతో అందరినీ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి అర్ధరాత్రి తరలించారు.
ఇలా మొత్తంగా 62 మంది వరకు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. వారందరి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకుగల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రసాదాన్ని పరీక్ష కోసం సేకరించారు. అధికారులు బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిత్యం సమీక్షిస్తున్నారు.