శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్లు (Encounter) జరిగాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్ జిల్లా నౌగావ్ షాహబాద్లో, కుల్గాం జిల్లాలోని మిర్హ్హాంలో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు నిర్వహించాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ సందర్భంగా భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. వారంతా జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. వారిలో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన వారిగా, మరో ఇద్దరు స్థానికులని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇంకా ఇద్దరిని గుర్తించాల్సి ఉందన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీసు అధికారి గాయపడ్డారని, దవాఖానకు తరలించామని, ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నాడని వెల్లడించారు. ఘటనా స్థలంలో ఎం 4, రెండు ఏకే 47 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.