తాపి (గుజరాత్), జనవరి 18: ఓ యువతి యువకుడు ప్రేమించుకున్నారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమలో మునిగిపోయారు. ఇద్దరూ తమ ప్రేమ విషయం కుటుంబసభ్యులకు తెలిపారు. వివాహం చేయాలని కోరారు. ఇందుకు రెండు కుటుంబాలు నిరాకరించాయి. ఇక తమ పెండ్లి కాబోదు.. కలిసి జీవించలేనప్పుడు కలిసి మరణిద్దామని ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ఒకేతాడుతో ఉరేసుకొని గణేశ్, రంజన అనే ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గుజరాత్లోని తాపి జిల్లాలో 2022 ఆగస్టులో చోటుచేసుకున్నది. ఇది జరిగిన ఆర్నెల్లకు అంటే ఇటీవల ప్రేమికుల రెండు కుటుంబాలు పంతం వీడాయి. దూరపు చుట్టరికం ఉన్నందున చర్చించుకొని ప్రేమికులిద్దరికి వివాహం చేయాలని భావించాయి. గణేశ్, రంజన విగ్రహాలు తయారుచేయించి వాటికి వివాహం జరిపించాయి.