న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత పెరిగిన నేపథ్యంలో గత నెలలో ఉద్యోగాల కోసం చురుకుగా ప్రయత్నిస్తున్న భారతీయ టెక్ నిపుణుల సంఖ్య నాలుగు రెట్లకు పైగా పెరిగింది. దీనివల్ల, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న దేశీయ ఉద్యోగ మార్కెట్లోకి భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు వచ్చి చేరారు. 20 ప్రధాన టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనవరి నుంచి ఒక్కో సంస్థ వెయ్యికి పైగా ఉద్యోగాల కోతలు చేపట్టాయి. ఆయా కంపెనీలకు చెందిన 56,000 మందికి పైగా భారతీయ నిపుణులు ప్రస్తుతం ఉద్యోగ అవకాశాల కోసం చురుకుగా వెతుకుతున్నారు. ఈ సంఖ్య నెల క్రితం కేవలం 12,000 మందికి కొద్దిగా ఎక్కువగా ఉండేది. కొందరు ఉద్యోగాల కోతల కారణంగా మార్కెట్లోకి వచ్చినప్పటికీ, మరికొందరు ఉద్యోగ భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ముందస్తుగా అవకాశాలను అన్వేషిస్తున్నారు.
ఈ వర్గంలో దాదాపు మూడింట రెండువంతుల మంది గతవారం రోజుల్లోనే రిక్రూటర్లు, యజమానులతో నిరంతర సంబంధాలు కొనసాగించినట్టు అధ్యయనంలో తేలింది. ఆరు నెలల క్రితం ఈ వర్గంలో చురుకైన ఉద్యోగార్థుల సంఖ్య సుమారు 5,000 ఉండగా ఏడాది క్రితం అది 4,000 కంటే తక్కువగా ఉండేది. ఈ సంఖ్యలో అకస్మాత్తుగా వచ్చిన పెరుగుదలకు మరో కారణం ఏమిటంటే, అధ్యయనంలో పరిశీలించిన సంస్థల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ సంస్థలు ఒరాకిల్, మెటా, డెల్, సిస్కో, అమెజాన్ తదితరాలు అమెరికా కేంద్రంగా పనిచేస్తుండడమే.
అమెరికా సంస్థల్లో పనిచేస్తున్న విదేశీ ప్రతిభకు సంబంధించిన అస్థిరత, సవాళ్లు భారతీయ ఉద్యోగుల్లో ఉద్యోగ అన్వేషణకు ప్రధాన కారణాలుగా మారాయి. ఈ ప్రవాహం వచ్చిన సమయం కూడా క్లిష్టంగానే ఉన్నది. సాంకేతిక రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుండగా, పోటీ మరింత తీవ్రమవుతున్నది. వ్యయ నియంత్రణ, ఏఐ ఆధారిత ఉత్పాదకత పెరుగుదల, అలాగే ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా టెక్ నియామకాలు 28 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.
“టెక్ రంగంలో నియామకాల పరిమాణం, వేగం రెండూ తగ్గిపోవడంతో ఉద్యోగులు జాబ్ మార్కెట్లోకి రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు” అని ఎక్స్‌ఫెనో సీఈవో ఫ్రాన్సిస్ పడమడన్ అన్నారు. ప్రధాన క్లయింట్ మార్కెట్లలో ప్రపంచ పరిణామాలు, భౌగోళికరాజకీయ సవాళ్లు భారత టెక్ రంగంలోని అన్ని విభాగాలు, అనుభవ స్థాయిల్లో నియామకాలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రవేశస్థాయి, అత్యున్నత స్థాయి ఉద్యోగులకు పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఈ స్థాయిల్లో క్రియాశీల డిమాండ్ ఇంకా తక్కువగానే ఉన్నది. ప్రస్తుతం ఎక్కువ నియామకాలు ఖాళీల భర్తీ కోసమే జరుగుతున్నందున అభ్యర్థులకు ఎంపికలు తగ్గిపోయి, చర్చల్లో బేరసారాల శక్తి కూడా పరిమితమవుతున్నది.
విదేశాల నుంచి తిరిగివచ్చిన అధిక వేతనాలు పొందుతున్న ప్రతిభావంతులకు భారతదేశంలో అదేస్థాయి వేతనంతో కూడిన జాబ్ ఆఫర్ పొందడం కష్టమవుతున్నదని ఫ్రాన్సిస్ తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు కూడా ఈ రంగంలో నెలకొన్న ఆందోళనలను ప్రతిబింబిస్తున్నాయి. “నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. రెండు నెలలుగా ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. ఒక్క ఇంటర్యూ కాల్ కూడా రావడం లేదు. ఇది మానసికంగా చాలా అలసట కలిగిస్తున్నది” అని ప్రభావిత ఉద్యోగి ఒకరు రెడిట్‌లో వ్యాఖ్యానించారు. “కెరీర్ ప్రారంభ దశలో ఉన్న డాటా రంగ ఉద్యోగాల విషయంలో మార్కెట్ కఠినంగా ఉంది” అని మరో వ్యక్తి పేర్కొన్నారు.
సెర్చ్, టాలెంట్ అడ్వైజరీ సంస్థ ఏబీసీ కన్సల్టెంట్లో టెక్నాలజీ, అవుట్సోర్సింగ్, ఆఫ్‌షోరింగ్ విభాగ భాగస్వామి రీతూ సేధీ మాట్లాడుతూ.. ఇటీవలి వారాల్లో మధ్యస్థ, సీనియర్ స్థాయి నిపుణుల నుంచి సంప్రదింపులు 30-35 శాతం పెరిగాయని, దీంతో ప్రతిభ సరఫరా డిమాండ్‌ను మించి కనిపిస్తున్నదని అన్నారు. ప్రస్తుతం ప్రజలు వేతనంపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. ఉద్యోగం దొరకడమే ప్రధానంగా మారిందని, వారిలో కొందరు వేతన కోతను కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మైకేల్ పేజ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ ప్రాంశు ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. టెక్ రంగంలో ఉద్యోగాల కోతకు గురైన అభ్యర్థుల నుంచి సంప్రదింపులు పెరిగినప్పటికీ, చురుకుగా వ్యవహరిస్తూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొన్న నిపుణులు జీసీసీలు, స్టార్టప్స్‌లో అవకాశాలను పొందుతున్నారని చెప్పారు.
ఏఐ, సైబర్ సెక్యూరిటీ, మల్టీక్లౌడ్ విభాగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు అధిక స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమూహంలోని ప్రతిభావంతులు జీసీసీలు, ఇండియన్, గ్లోబల్ ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ సంస్థలు, గ్లోబల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ సంస్థల్లోకి మారినట్టు ఎక్స్‌ఫెనో పేర్కొన్నది. ఈ మార్పు నుంచి టాలెంట్‌ను గ్రహించిన కంపెనీల్లో డెలాయిట్, రివల్యూట్, వాల్‌మార్ట్ గ్లోబల్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, యాక్సెంచర్, ఐబీఎమ్ ఉన్నాయని అధ్యయనం తెలిపింది.