న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో 56 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలూ ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. విద్య, మహిళలు, బాలలు, యువత, క్రీడలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దీనిని పార్లమెంటులో బుధవారం ప్రవేశపెట్టారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఆయా విద్యా సంస్థల్లో బోధన నాణ్యత నిర్వీర్యమవుతున్నదని హెచ్చరించింది.
ఓబీసీలకు కేటాయించిన 3,652లో 1,521 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఎస్సీలకు రిజర్వు చేసిన 2,315 పోస్టుల్లో 788, ఎస్టీలకు కేటాయించిన 1,154 పోస్టుల్లో 472 భర్తీ కాలేదని వివరించింది. తాత్కాలిక నియామకాల వల్ల విద్యా స్వేచ్ఛకు విఘాతం కలిగించకూడదని స్థాయీ సంఘం నివేదిక హెచ్చరించింది.