లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో 55 ఏళ్ల వ్యక్తి.. తనకు కాబోయే కోడల్ని పెళ్లి చేసుకున్నాడు. వాస్తవానికి తన 17 ఏళ్ల కుమారుడికి వధువును మాట్లాడటానికి వెళ్లి ఆ అమ్మాయితో రిలేషన్ పెంచుకున్నాడతను. ఈ షాకింగ్ ఘటనకు చెందిన విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. యూపీలోని బన్స్నాగలి గ్రామంలో ఇటీవల ఈ ఘటన జరిగింది.
షకీల్ అనే వ్యక్తికి ఆరుగురు పిల్లలు. ముగ్గురు పిల్లలకు తాతయ్య కూడా. అయితే 22 ఏళ్ల అమ్మాయితో ఇటీవల తరుచూ మాట్లాడడం మొదలుపెట్టాడు. కూతురుకు పెళ్లి చేసే కమ్రంలో ఆయేషా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడినట్లు షకీల్ భార్య షబానా తెలిపింది. షకీల్‌ను ప్రశ్నించగా, తన కుమారుడి పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాడు. అయితే కుమారుడు అమన్ వయసు, అమ్మాయి వయసు తేడా ఎక్కువ ఉన్న దృష్ట్యా.. ఆ పెళ్లి వద్దు అని షబానా కుటుంబం వాదించింది. కానీ బలవంతంగా ఆ పెళ్లి చేసేందుకు షకీల్ వత్తిడి చేశాడు. తండ్రి ప్రవర్తన పట్ల చికాగు చెందిన కుమారుడు.. షకీల్ ఫోన్‌ను చెక్ చేశాడు. అభ్యంతరకరమైన కాంటెంట్ ఉన్న నేపథ్యంలో కుమారుడు ఆ పెళ్లికి నిరాకరించాడు.
సీన్ కట్ చేస్తే, ఓ పనిమీద గతవారం ఢిల్లీకి వెళ్లాడు షకీల్. కుమారుడి కోసం చూసిన అమ్మాయినే పెండ్లి చేసుకున్నట్లు అతను తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ అమ్మాయి తనకు కోడలుగా వస్తుందనుకున్నాను, కానీ తన భర్తకు భార్య అవుతుందని అనుకోలేదని షబానా చెప్పింది. ఈ ఘటన పట్ల ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు. ఎవరైనా ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు వస్తే చర్యలు తీసుకుంటామని బోటా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అమర్ సింగ్ రాథోడ్ తెలిపారు.