న్యూఢిల్లీ, డిసెంబర్ 6: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం రేగింది. తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట దొరికినట్టు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ శుక్రవారం సభలో ప్రకటించారు. గురువారం సభ ముగిసిన తర్వాత భద్రతాపరమైన తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బందికి సింఘ్వికి కేటాయించిన 222 సీటు వద్ద వంద రూ.500 నోట్లున్న కట్ట లభించిందని ఆయన తెలిపారు. ఈ నోట్లపై విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు. ఈ నోట్ల కట్ట తమదే అని ఎవరూ ఇంతవరకు చెప్పలేదని, నగదును మర్చిపోయేంతలా ప్రజల ఆర్థిక స్థితి ఉందని ఈ ఘటన ప్రతిబింబిస్తున్నదా? అని ఆయన అన్నారు.
విచారణ జరపకుండా సభ్యుడి పేరును చైర్మన్ ప్రస్తావించడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. సభకు నోట్ల కట్టలు తీసుకురావడం సరికాదని, ఈ విషయంపై విచారణ జరపాలని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ‘కొన్ని అంశాలపై మీరు ఆత్రుత ప్రదర్శిస్తారు, ఇంకొన్ని అంశాలను కప్పిపుచ్చాలనుకుంటారు’ అంటూ కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మరో మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అయితే, అదానీ అంశంపై నుంచి దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. సభలో నగదు లభించడంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీలు నినాదాలు ప్రారంభించడంతో గందరగోళం నెలకొన్నది. వారికి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.
తాను ఒకే ఒక్క రూ.500 నోటుతో సభకు వచ్చినట్టు అభిషేక్ మను సింఘ్వి ‘ఎక్స్’లో పేర్కొన్నారు. గురువారం తాను 12.57కు సభలోకి వచ్చానని, ఒంటి గంటకు సభ వాయిదా పడిందని, మూడు నిమిషాలే తాను సభలో ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి విషయాలపై కూడా రాజకీయాలు చేయడం తనకు వింతగా ఉందని అన్నారు. ఎవరో వచ్చి ఏదైనా సీటులో ఏ వస్తువైనా ఎలా పెట్టగలరో విచారణ జరిపించాలని ఆయన పేర్కొన్నారు.