Hanuman Idol | ఒకటి కాదు రెండు కాదు.. ఆ విగ్రహానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. తమిళనాడులోని అరియాలూర్ జిల్లాలోని వెల్లూరు గ్రామంలో ఉన్న వరదరాజా పెరుమాల్ గుడికి చెందిన హనుమంతుడి విగ్రహం అది. కానీ.. దాన్ని 2012లోనే దొంగలించారు. కట్ చేస్తే ఆ విగ్రహం ఆస్ట్రేలియాలో ప్రత్యక్షమైంది. 2014లో దాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి వేలం ద్వారా 37500 డాలర్లకు(28 లక్షల రూపాయలు) దక్కించుకున్నాడు.
ఇటీవల.. ఆ విగ్రహం జాడ దొరికింది. నిజానికి అది మామూలు విగ్రహం కాదు. దానికి చాలా చరిత్ర ఉంది. 500 ఏళ్ల నాటి అతి పురాతన విగ్రహం అది. యూఎస్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ అధికారుల సాయంతో ఆ విగ్రహం ఆస్ట్రేలియాలో ఉందని తమిళనాడు పోలీసులు తెలుసుకున్నారు.
ఆ విగ్రహాన్ని 14 లేదా 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య సమయంలో నిర్మించిట్టు తెలుస్తోంది. అయితే.. ఆ విగ్రహాన్ని ఆక్షన్‌లో పెట్టిన కంపెనీకి కానీ.. దాన్ని కొన్న వ్యక్తికి కానీ.. అది ఇండియా నుంచి దొంగలించి తీసుకొచ్చిన విగ్రహం అని తెలియదట. చివరకు దాని చరిత్ర తెలిసేసరికి.. ఆ విగ్రహాన్ని ఆస్ట్రేలియా అధికారులు స్వాధీనం చేసుకొని ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో ఉన్న భారత హైకమిషనర్ మన్‌ప్రీత్ వోహ్రాకు అందించారు. త్వరలోనే ఆ విగ్రహాన్ని భారత్‌కు తీసుకురానున్నారు.
2012లో హనుమంతుడి విగ్రహంతో పాటు వరదరాజా పెరుమాల్ గుడిలో శ్రీదేవీ, భూదేవీ విగ్రహాలు కూడా మాయం అయ్యాయి. అయితే.. వాటి జాడ మాత్రం ఇంకా తెలియలేదు. అయితే.. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం గత ఏడేళ్లలో ఇలా దొంగలించబడిన 212 కళాఖండాలను స్వదేశానికి తీసుకొచ్చింది. అందులో ఎక్కువ విగ్రహాలు మెటల్, రాయి, టెర్రకొట్టా లాంటి వాటితో తయారు చేసినవే. అందులో ఎక్కువ కళాఖండాలను యూఎస్ నుంచి తీసుకొచ్చినవే.