50% కోటా డిమాండ్‌పై కొలీజియంలో చర్చిస్తా
జస్టిస్ హిమాకోహ్లీ సన్మాన సభలో సీజేఐ రమణ
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోర్టుల్లో మహిళల ప్రాతినిధ్యం 50 శాతం కంటే ఎక్కువగా ఉండాలన్న డిమాండ్‌ను కొలీజియం సభ్యుల ముందు ప్రతిపాదిస్తానని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ హిమాకోహ్లీ సన్మాన వేడుకలో మంగళవారం సీజేఐ ప్రసంగించారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు సోదరిలాంటి హిమాకోహ్లీ తన బాగోగులపై ఆందోళన చెందేవారని గుర్తుచేశారు. సీజేఐగా విధులు నిర్వహించడం ఒత్తిడితో కూడిన ప్రక్రియ అని, అయినప్పటికీ, తాను ఆ బాధ్యతలను విస్మరించబోయేది లేదన్నారు. కింది కోర్టుల్లో సగటున 30 శాతం మంది మాత్రమే మహిళా జడ్జిలు ఉన్నారని, హైకోర్టుల్లో ఇది కేవలం 11.5 శాతమేనన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉండగా, ఇందులో నలుగురు మాత్రమే మహిళా న్యాయమూర్తులని గుర్తుచేశారు. దేశంలో 17 లక్షల మంది న్యాయవాదులుగా రిజిస్టర్ కాగా.. ఇందులో మహిళల వాటా 15 శాతమేనన్నారు. పాఠశాల విద్య పూర్తికాగానే న్యాయవిద్యను ఎంపిక చేసుకునే విద్యార్థినుల సంఖ్య పెరుగాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు.