Bhopal Land Scam | న్యూఢిల్లీ, మే 11: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో బూరోక్రాట్ల భారీ భూకుంభకోణం బయటపడింది. ఐఏఎస్ అధికారులు సమర్పించిన స్థిరాస్తి రిటర్న్లు(ఐసీఆర్) మధ్యప్రదేశ్లోని దురాడీ ఘాట్ గ్రామంలో భారీ పెట్టుబడులను సూచిస్తున్నట్లు దైనిక్ భాస్కర్ వెల్లడించింది.
ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 50 మంది అధికారులు కోలార్ ప్రాంతంలోని ఈ పరిసరాల్లో ఒకే రోజు వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఇందులో ఢిల్లీలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా క్యాడర్లకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. అంతేగాకుండా ఈ కొనుగోళ్లు జరిగిన కేవలం 16 నెలల తర్వాత ఇదే ప్రాంతానికి రూ. 3,200 కోట్ల విలువైన వెస్టర్న్ బైపాస్ ప్రాజెక్టు ఆమోదం పొందింది. ఆ తర్వాత కేవలం 10 నెలలకే ఆ భూమి వినియోగాన్ని వ్యవసాయం నుంచి నివాసయోగ్యంగా పునర్వర్గీకరించారు. ఫలితంగా, ఆ భూమి విలువ ఏకంగా 11 రెట్లు పెరిగింది. అయితే, ఈ ప్రదేశంలో ఇప్పటివరకు పైన పేర్కొన్న ప్రయోజనం కోసం ఏ సొసైటీని అభివృద్ధి చేయలేదు. నివాస ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందు ప్లాట్లను కేటాయించాలి. లేదా భూమిని సొసైటీ పేరు మీదికి బదిలీ చేయాలి.
ఎలా మొదలైందంటే..
2022 ఏప్రిల్ 4న 2023 హెక్టార్ల వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేయడానికి ఒకే పత్రంపై సంతకాలు జరిగాయి. ఈ లావాదేవీ ద్వారా 50 మంది వ్యక్తులు సమిష్టిగా ఈ భూమిని కొనుగోలు చేశారు. ఈ ఆస్తిని రూ. 5.5 కోట్ల విలువకు రిజిస్టర్ చేయగా దాని మార్కెట్ విలువ రూ. 7.78 కోట్లుగా నమోదైంది. 2023 ఆగస్టు 31న క్యాబినెట్ బైపాస్కు ఆమోదం తెలిపింది. ప్రస్తుత అలైన్మెంట్ ప్రకారం ఇది ఈ నిర్దిష్ట ఆస్తికి 500 మీటర్ల దూరంలో ఉంది. కొనుగోలు సమయంలో ఆ భూమి వ్యవసాయ భూమిగా పరిగణనలో ఉంది. అయితే, 2024 జూన్లో బైపాస్కు ఆమోదం లభించిన కేవలం 10 నెలల తర్వాత దాన్ని నివాస భూమిగా మార్చారు. 2022లో సుమారు 217,800 చదరపు అడుగుల విస్తీర్ణం గల 5 ఎకరాల వ్యవసాయ భూమిని అప్పటి చదరపు అడుగుకు సుమారు రూ.81.35 చొప్పున సేకరించారు. 2024 జూన్లో భూ వినియోగాన్ని మళ్లించిన తర్వాత ఈ ధర చదరపు అడుగుకు సుమారు రూ.557కు పెరిగింది. ఫలితంగా ఆ 5 ఎకరాల భూమి విలువ 21,314,600కు పెరిగింది. ప్రస్తుత మార్కెట్ విలువ రూ.55 కోట్ల – రూ.65 కోట్లు ఉంటుందని అంచనా.