జైపూర్: రాజస్థాన్లోని (Rajasthan) దౌసాలో విషాదం చోటుచేసుకున్నది. బోరుబావిలో పడిన ఐదేండ్లు బాలుడిని రెస్క్యూ సిబ్బంది రక్షించినప్పటికీ అతడు మరణించాడు. దీంతో 57 గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతమైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దౌసా జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో ఆర్యన్ అనే ఐదేండ్ల బాలుడు.. ఇంటి పక్కనే ఉన్న 175 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకు సహాయకచర్యలు ప్రారంభించారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అల్యూమినియంతో తయారు చేసిన హుక్ ద్వారా బాలుడిని బయటకు తీయడానికి విఫలయత్నం చేశారు. అది ఫలించకపోవడంతో బోరుబావికి కొంత దూరంలో 4 అడుగుల వెడల్పుతో గుంత తీశారు. 150 అగుడుల మేర తవ్వకం పూర్తయిన తర్వాత అందులోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. సొరంగం తవ్వి బాలుడిని కాపాడారు. అప్పటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో గ్రీన్ చానల్ ఏర్పాటుచేసి అంబులెన్సులో దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మరణించనట్లు వైద్యులు నిర్ధారించారు.