లుథియానా: కెనడా(Canada)లోని బ్రాంప్టన్‌లో ఉన్న ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. దాంట్లో పంజాబ్‌కు చెందిన ఓ కుటుంబంలోని అయిదుగురు వ్యక్తులు మరణించారు. ఆ విషాద ఘటనతో లుథియానా జిల్లాలోని గురం గ్రామం శోకసముద్రంలో మునిగింది. వారం క్రితం ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వ్యక్తుల్లో అర్షవీర్ కౌర్ గర్భంలోని బిడ్డ కూడా ఉన్నది. వాస్తవానికి ఆమె ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఇంటి మీద నుంచి దూకింది. అర్షవీర్ బ్రతికే ఉన్నది. కానీ ఆమె కడుపులోని బిడ్డే బ్రతకలేదు. గత గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో జుగ్రాజ్ సింగ్ అనే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు బంధవులు తెలిపారు. జుగ్రాజ్ అత్త, మరదలు, బావమరిది, అతని భార్య ఆ ప్రమాదంలో ఆహుతయ్యారు. తప్పించుకునే క్రమంలో అర్షవీర్ కౌర్ గాయాలపాలైంది.