న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్(NEET Paper Leak) ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అయితే కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. 2025 నీట్ పరీక్షలో.. జైపూర్‌కు చెందిన బివాల్ ఫ్యామిలీలోని అయిదుగురు సభ్యులు ఆ పరీక్షను క్లియర్ చేశారు. వాళ్లు ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించారు. వాళ్లు సాధించిన సక్సెస్ పట్ల దేశం గర్వించింది. ఆ ఫ్యామిలీకి నలుమూలల నుంచి కంగ్రాట్స్ వెల్లువెత్తాయి. దినేశ్ బివాల్ అనే వ్యక్తి తన ఫేస్బుక్లో 2025 నవంబర్ 6వ తేదీన ఓ పోస్టు పెట్టారు. తమ అయిదుగురు పిల్లలు నీట్లో ర్యాంక్ కొట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించారని, దీని పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నాడు. అయితే ఆ దినేశ్‌పై ఇప్పుడు ఫోకస్ పడింది. ఏడాది తర్వాత అతనిపై నిఘా పెట్టారు. దినేశ్‌తో పాటు అతని సోదరుడు మంగీలాల్‌ను అరెస్టు చేశారు. నీట్ పేపర్ లీక్ స్కాండల్‌లో మంగీలాల్ మేనల్లుడు వికాశ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో విద్యా వ్యవస్థలో మాఫియా పేరుకుపోయినట్లు భావిస్తున్నారు. మెడికల్ అడ్మిషన్ విధానంలో చాలా లొసగులు ఉన్నట్లు తెలుస్తోంది. బివాల్ ఫ్యామిలీ సక్సెస్ స్టోరీ వెనుక నీట్ పేపర్ లీక్ నెట్వర్క్ ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ ఇంట్లో మెడికల్ సీట్లు కొట్టిన ప్రతి ఒక్కరు 10, 12వ తరగతుల్లో యావరేజ్ మార్కులు మాత్రమే స్కోరు చేశారు.
మంగీలాల్ కుమారుడు వికాశ్ నీట్ పరీక్షలో పాసై సవాయి మాదోపూర్ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాడు. కానీ అతనికి పదో తరగతిలో 63 శాతం, 12వ తరగతిలో 55 శాతం మార్కులు వచ్చాయి. ఇక నీట్ 2024లో అతను కేవలం 270 మార్కులు మాత్రమే స్కోరు చేశాడు. ఇక కోచింగ్ సెంటర్లో అతను 46 సార్లు పరీక్ష రాస్తే, అతనికి కేవలం సగటున 384 మార్కులు మాత్రమే వచ్చాయి. అయితే నీట్ 2025లో అతను 85.11 శాతం మార్కులు సంపాదించాడు. ఇక మంగీలాల్ కుమార్తె ప్రగతి .. దౌసా మెడికల్ కాలేజీలో సీటు సంపాదించారు. ఆమెకు పదో తరగతిలో 69 శాతం, 12వ తరగతిలో 91 శాతం మార్కులు వచ్చాయి. నీట్ 2024లో ఆమె 332 మార్కులు స్కోరు చేసింది. ఇక కోచింగ్ సెంటర్లో ఆమె యావరేజ్ స్కోరు 302 మాత్రమే. కానీ నీట్ 2025లో 89.08 శాతం మార్కులతో ప్రగతి మెడికల్ అడ్మిషన్ తీసుకున్నది.
దినేశ్ కుమార్తె గుంజన్ 10వ తరగతిలో 86 శాతం, 12వ తరగతిలో 70 శాతం మార్కులు స్కోర్ చేసింది. నీట్ 2024లో ఆమెకు 355 మార్కులు వచ్చాయి. ఇక కోచింగ్ సెంటర్లో ఆమెకు సగటున 340 వచ్చాయి. కానీ నీట్ 2025లో వారణాసి మెడికల్ కాలేజీలో ఆమెకు సీటు వచ్చింది. బివాల్ మూడో సోదరుడు గణశ్యామ్ కుమార్తె సానియా ముంబైలోని మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారు. పదో తరగిలో ఆమెకు 63 శాతం, 12వ తరగతిలో 89 శాతం మార్కులు వచ్చాయి. నీట్ 2024లో ఆమె 360 స్కోర్ చేసింది. ఇక సికర్‌లోని కోచింగ్ సెంటర్లో ఆమె యావరేజ్ మార్కులు 360. కానీ నీట్ 2025లో ఆమెకు 94.07 శాతం మార్కలు వచ్చాయి. గణశ్యామ్కు చెందిన మరో కుమార్తె పాలక్ పదిలో 93, 12లో 89 శాతం మార్కులు సాధించింది. నీట్ 2024లో ఆమెకు 512 మార్కులు వచ్చాయి. కోచింగ్ సెంటర్లో ఆమె యావరేజ్ మార్కులు 550. కానీ నీట్లో ఆమెకు 98.61 శాతం మార్కులు వచ్చాయి. జైపూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆమె సీటు సంపాదించింది.
అయితే నీట్ 2025 పరీక్ష పేపరు లీకైనట్లు ఆధారాలు లేవు. కానీ స్కామ్‌తో లింకున్నట్లు సోషల్ మీడియాలో చాలా ఆధారాలు కనిపించాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, సైబర్ ఏజెన్సీలు ఆ ఆరోపణలను కొట్టిపారేశాయి. తాజాగా 2026 నీట్ పేపర్ లీక్‌లో దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. 3వ తేదీ పరీక్షను రద్దు చేసిన కేసులో.. శుభమ్ ఖైర్నార్ అనే వ్యక్తిని నాసిక్‌లో పట్టుకున్నారు. పూణెకు చెందిన యశ్ యాదవ్‌కు అతను సమాచారం చేరవేశాడు. ఓ పేపర్‌ను పంపినట్లు చెప్పాడు. ఏప్రిల్ 29వ తేదీ వరకు లీకైన పేపర్‌కు చెందిన డీల్ కుదిరినట్లు తెలిసింది. ఆ తర్వాత ఖైర్నార్తో పాటు మరికొందరు.. నీట్ అభ్యర్థులకు వల వేశారు. బివాల్ ఫ్యామిలీకి యాదవ్ పేపర్‌ను పంపాడు. ఆ ఫ్యామిలీకి చెందిన మంగీలాల్ తన కుమారుడు వికాశ్ కోసం ఖైర్నార్‌ను కాంటాక్ట్ అయ్యాడు.
సీబీఐ బృందాలు గురువారం నిందిత సోదరులు మంగీలాల్, దినేశ్ బివాల్ ఇండ్లల్లో సోదాలు చేపట్టాయి. ఇద్దరు సోదరులతో పాటు వికాశ్‌ను కూడా అరెస్టు చేశారు. ఏడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. సమీపంలో ఉన్న ఫార్మ్‌హౌజ్‌లో గాలింపు చేపట్టారు. అక్కడ పార్కింగ్ చేసిన లగ్జరీ వాహనాలను చెక్ చేశారు. పేపర్ లీక్ రాకెట్‌తో లింకున్న పలు కీలక ఆధారాలను సీజ్ చేసినట్లు తెలిసింది. దినేశ్ బివాల్ కుమారుడు రిషి ఈ ఏడాది నీట్ రాశాడు. అతని కోసం సీబీఐ గాలిస్తున్నది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది.