న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో కూడా కరోనా బాధితుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. థర్డ్ వేవ్ ప్రారంభంలో ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా బాధితుల సంఖ్య 5 నుంచి 10 శాతం మధ్య ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. సెకండ్ వేవ్‌లో 20 నుంచి 30 శాతం మంది రోగులు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందారు. ఇక థర్డ్ వేవ్‌లో ఈ శాతం దాటిపోయే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
సోమవారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 1.79 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. పది రోజుల క్రితం 10 వేల నుంచి 15 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య పదింతలు దాటిపోయింది.
కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. అవసరమైనప్పుడు కొవిడ్ కేర్ సెంటర్లను ఆక్సిజన్ బెడ్స్ ఆస్పత్రులుగా మార్చాలని ఆదేశించింది. జూనియర్ డాక్టర్లు, నర్సులతో పాటు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ సేవలను అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించింది.