Uttar Pradesh | లక్నో: హత్య, హత్యాయత్నం కేసులో 43 ఏళ్లు జైలు శిక్షను అనుభవించిప ఓ వ్యక్తి 104 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో అప్పీల్ పెండింగ్లో ఉండగానే మరణించారు. జిల్లా న్యాయ సేవల అథారిటీ కార్యదర్శి, అదనపు జిల్లా జడ్జి పూర్ణిమ ప్రాంజల్ తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా, గౌరయే గ్రామస్థుడు లఖన్ జైలు రికార్డుల ప్రకారం 1921 జనవరి 4న జన్మించారు.
1977 ఆగస్టు 16న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రభు సరోజ్ మరణించారు. ఈ హత్య కేసులో లఖన్, మరో ముగ్గురు దోషులని నిర్ధారించిన ప్రయాగ్ రాజ్ జిల్లా, సెషన్స్ కోర్టు 1982లో వీరందరికీ జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై వీరంతా అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేశారు. విచారణలో ఉండగానే మిగిలిన ముగ్గురూ మరణించారు. లఖన్ నిర్దోషి అని హైకోర్టు ఈ నెల 2న తీర్పు చెప్పింది.
43 ఏండ్ల పాటు శిక్ష అనుభవించిన తర్వాత ఆయన నిర్దోషి అని తీర్పు రావడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయనను ఈ నెల 20న కౌశాంబి జిల్లా జైలు నుంచి విడుదల చేశారు. ఆయనను ఈ జిల్లాలోని షరిర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఆయన కుమార్తె తన ఇంటికి సురక్షితంగా తీసుకెళ్లారు. ఆయన విడుదలకు జిల్లా జైలు సూపరింటెండెంట్ సహకరించారని పూర్ణిమ తెలిపారు.