పట్నా: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన 43 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. అదేవిధంగా మరో 18 మంది ఆచూకీ కూడా ఇప్పటివరకు లభ్యం కాలేదని బీహార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్టుమెంట్ తెలిపింది.
ఇక ప్రమాదంలో 47 మంది బీహారీలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలియజేసింది. కాగా మూడు రైళ్లు ఢీకొన్న ఈ బాలాసోర్ ఘటనలో మొత్తం 288 మంది ప్రాణాలు కోల్పోయారు. 800 మందికిపైగా తీవ్రంగా గాయపడి దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.