లక్నో, మే 3: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో పోలీసుల ముందుకు ఒక ఆశ్చర్యకరమైన ఫిర్యాదు వచ్చింది. పెండ్లి చేసుకోవటంలో తనకు సాయం చేయాలంటూ 41 ఏండ్ల మహిళ పోలీసులను కోరింది. అన్నావదినలు తన పెండ్లి గురించి పట్టించుకోవటం లేదంటూ ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ఆధారంగా.. జిల్లాలోని ‘సరాయ్ ఇనాయత్’ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. సదరు మహిళ కోసం వస్తున్న పెండ్లి సంబంధాల్ని కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నట్టు తెలిసింది.
తన పెండ్లి జరగకుండా కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని సదరు మహిళ పోలీసుల ముందు తన గోడు వెళ్లబోసుకుంది. తన కోసం వస్తున్న ప్రతి పెండ్లి సంబంధాన్ని అన్నా వదినలు తిరస్కరిస్తున్నారని ఆరోపించింది. కాబట్టి తన పెండ్లికి కుటుంబ సభ్యులు అడ్డంకులు సృష్టించకుండా చూడాలంటూ పోలీసులను కోరింది. కాగా, ఆమె ఆరోపణల్ని కుటుంబసభ్యులు తోసిపుచ్చారు.