భోపాల్, ఆగస్టు 23: మధ్యప్రదేశ్‌లోని జామ్ నది ఒడ్డున శతాబ్దాల నాటి ‘గోట్మార్’ అనే రాతి యుద్ధ ఉత్సవాన్ని ఇరు గ్రామాల ప్రజలు శనివారం ఆవేశం, క్రూరత్వాన్ని రంగరించుకుని జరుపుకున్నారు. ఆచారం ప్రకారం ప్రత్యర్థి గ్రామాలు పంధుర్న, సావర్గావ్ ఈ ప్రత్యేక ఉత్సవంలో తలపడ్డాయి. ఆచారబద్ధమైన ఈ యుద్ధంలో ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకుని గాయపర్చుకున్నారు. ఈ ఆచార ఉత్సవం ఎన్నో ఏండ్లుగా నడుస్తున్నదని గ్రామస్థులు తెలిపారు.
మధ్యాహ్నం నాటికి 934 మంది గాయపడగా, అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని నాగ్‌పూర్‌కు తరలించారు. ఎన్నో ఏండ్ల నుంచి క్రమం తప్పకుండా ఆచారంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో ఇప్పటివరకు 13 మంది మరణించగా, వందలాది మంది కళ్లు, కాళ్లు, చేతులు పోగొట్టుకుని దివ్యాంగులయ్యారు. అయినా ఈ ఉత్సవ నిర్వహణకు ఆదరణ పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఈ ఆచారం జరపడానికి ఒక కథ ప్రచారంలో ఉంది.
400 ఏండ్ల క్రితం పంధుర్న గ్రామానికి చెందిన ఒక యువకుడు, సావర్గావ్ గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ కలిసి పారిపోతూ జామ్ నది ఒడ్డుకు రాగా, గుర్తించిన సావర్గావ్ గ్రామస్థులు వీరిపై రాళ్లు విసిరారు. అయితే పంధుర్న గ్రామస్తులు దయతో వ్యవహరించి రక్షించినప్పటికీ ఈ గందరగోళంలో ప్రేమికులిద్దరూ మరణించారు. దీంతో అప్పటి నుంచి ప్రేమకథ ఆచార పోరాటంగా సాగుతున్నది.