PM Modi | న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా రోజురోజుకు దిగజారుతున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురుగా మారిందనే గప్పాలు ఉత్తివేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇతర దేశాల్లో పౌరుల్లో భారత్ పట్ల సానుకూల దృక్పథం తగ్గిపోయి, ప్రతికూల అభిప్రాయం పెరిగిపోతున్నదని ప్యూ రిసెర్చ్ సెంటర్ తన సర్వేలో తెలిపింది. స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, పొలండ్, యూకే వంటి యూరోపియన్ దేశాల్లో గతంలో పోలిస్తే భారత్ పట్ల సానుకూల దృక్పథం 10 శాతం తగ్గిపోయిందని పేర్కొన్నది. భారత్‌తో కూడిన జీ20 దేశాలతో సహా 24 దేశాల్లో 30,861 మంది వయోజనులపై ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి మే 22 వరకు ఈ సర్వే నిర్వహించారు. మొత్తంగా 34 శాతం మంది భారత్ పట్ల ప్రతికూల అభిప్రాయాలను వ్యక్తం చేశారని ప్యూ రిసెర్చ్ సెంటర్ తెలిపింది.
70 నుంచి 39 శాతానికి..
భారత్ పట్ల సానుకూల దృక్పథం ఉన్న వారి సంఖ్య ఫ్రాన్స్‌లో భారీగా తగ్గిపోయింది. 2008లో వీరి సంఖ్య 70 శాతం ఉండగా, ప్రస్తుతం ఇది 39 శాతానికి పడిపోయింది. స్పెయిన్‌లో అయితే 49 శాతం మంది వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్‌లోనూ ఇదే పరిస్థితి. యూకేలో అయితే సానుకూల అభిప్రాయం ఉన్న వారి సంఖ్య 2008తో పోలిస్తే 9 శాతం తగ్గి, ప్రతికూల అభిప్రాయం ఉన్న వారి సంఖ్య 23 శాతానికి పెరిగింది. అమెరికా, కెనడా, జర్మనీ దేశాల్లోనూ భారత్ పట్ల సానుకూల ఒపీనియన్ గతంలో పోలిస్తే గణనీయంగా పడిపోయింది.
ఆ విశ్వాసం మాకు లేదు!
అంతర్జాతీయ వ్యవహారాల్లో మోదీ సరైన నిర్ణయాలు తీసుకొంటారనే నమ్మకం తమకు లేదని సర్వేలో 40 శాతం మంది స్పష్టం చేశారు. మోదీ హిందూత్వ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని మెక్సికన్లు, బ్రెజిలియన్లు తీవ్రంగా విమర్శించారు. మోదీ పట్ల తమకు విశ్వాసం లేదని ఈ రెండు దేశాల్లో సగానికంటే ఎక్కువ మంది చెప్పడం గమనార్హం. అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికా వాసుల్లోనూ మోదీ పట్ల విశ్వాసం పూర్తిగా లోపించినట్టు ఈ సర్వేలో తేలింది. అమెరికాలో అసలు 40 శాతం మంది మోదీ గురించి ఎన్నడూ విననేలేదని చెప్పడం గమనార్హం. ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ముందు మోదీ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయాలు, ప్రవాస భారతీయుల్లో ఉన్న భావన, భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగేందుకున్న అవకాశాలపై ప్యూ రిసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.