న్యూఢిల్లీ, మే 14: ఉద్యోగాలపై కృత్రిమ మేధ చూపనున్న ప్రభావంపై అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా హెచ్చరికలు చేశారు. జాబ్ మార్కెట్‌ను ఏఐ ఒక సునామీలాగా ముంచెత్తనున్నదని, రానున్న రెండేండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి మార్కెట్ స్వరూపాన్నే సమూలంగా మారుస్తుందని ఆమె పేర్కొన్నారు. గణనీయ సంఖ్యలో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడుతుందని, అభివృద్ధి చెందిన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలు పోతాయని, ప్రపంచ మొత్తంగా చూస్తే ఈ సంఖ్య 40 శాతం ఉంటుందని అన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రజలను సిద్ధం చేసేందుకు మనకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉన్నదని, అయితే వ్యాపార సంస్థలు ఏఐ కోసం సిద్ధంగా ఉన్నాయని క్రిస్టలినా పేర్కొన్నారు. కృత్రిమ మేధకు పలు రంగాల్లో ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచే శక్తి ఉన్నప్పటికీ, అయితే దాన్ని సక్రమంగా నిర్వహించుకోలేకపోతే తప్పుడు సమాచారం, సమాజంలో ఆదాయ ఆసమానతలు వంటి సమస్యలు పెరుగతాయని హెచ్చరించారు. మరోవైపు ప్రపంచంలో ఆర్థిక మాంద్యం లేదని అభిప్రాయపడిన ఐఎంఎఫ్ చీఫ్.. ఆర్థిక మాంద్యంపై గత ఏడాది తలెత్తిన ఆందోళనలను ఖండించారు. చాలా రీజియన్లలో ద్రవ్యోల్బణం రేటు కూడా తగ్గడం ప్రారంభమైనందని పేర్కొన్నారు. పర్యావరణ మార్పుల అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నిరంతర ముప్పుగా ఉన్నదని, ఈ విషయంలో ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆమె అభిప్రాయపడ్డారు.
అధునాతన ఫీచర్లతో ‘జీపీటీ-4వో’
ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ తమ ఏఐ మాడల్ చాట్‌జీపీటీలో ‘జీపీటీ-4వో’ పేరిట కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీన్ని త్వరలో అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. అయితే దీని వినియోగానికి కొన్ని షరతులు ఉంటాయని, పెయిడ్ సబ్‌స్ర్కైబర్లకు మాత్రం అవి వర్తించవని స్పష్టం చేసింది. ‘జీపీటీ-4వో’లో అత్యాధునిక వాయిస్, టెక్ట్స్, విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. జీపీటీ-4 టర్బోతో పోలిస్తే కొత్త వెర్షన్ రెండు రెట్లు వేగంగా పనిచేస్తుందని, సబ్స్క్రిప్షన్ ధర కూడా సగానికి తగ్గుతుందని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటీ తెలిపారు. కొత్త మాడల్ తెలుగు, గుజరాతీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ సహా దాదాపు 50 భాషలను సపోర్టు చేస్తుంది. వాయిస్ కమాండ్లకు మనిషి తరహాలోనే కేవలం 232 మిల్లీ సెకండ్లలోనే సమాధానం ఇస్తుందని ఓపెన్ఏఐ తెలిపింది. మరోవైపు మ్యాక్ ఓఎస్ యూజర్లకు డెస్క్‌టాప్ యాప్‌ను విడుదల చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. విండోస్ యూజర్లకు కూడా దీన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.