న్యూఢిల్లీ, జనవరి 1: నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న వేళ స్విట్జర్లాండ్‌లోని ఓ విలాసవంతమైన బార్లో బుధవారం అర్ధరాత్రి పేలుడు సంభవించి 40 మంది వరకు మరణించగా, మరో 100 మంది గాయపడ్డారని స్విస్ పోలీసులను ఉటంకిస్తూ ఇటలీ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే మృతుల సంఖ్య పదుల సంఖ్యలో ఉంటుందని స్విస్ పోలీసులు తెలిపారు. క్రాన్స్ మోంటానా పట్టణంలోని లె కాన్ట్సెలేషన్ బార్‌లోని బేస్మెంట్లో, లాంజ్‌లో పేలుడు సంభవించినట్లు స్విస్ అధికారులు చెప్పారు. ఇది ఉగ్రదాడి కాదని, మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించి ఉండవచ్చని వారు చెప్పారు.
పేలుడు జరిగిన సమయంలో బార్లో 150 మందికిపైగా ఉన్నారని వారు తెలిపారు. అసాధారణ రీతిలో దేశంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొని అడవులు దగ్ధం అవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బాణసంచా పేల్చడంతో ఈ పేలుడు జరిగి ఉంటుందని స్విస్ మీడియా అనుమానం వ్యక్తం చేసింది. అయితే పోలీసులు మాత్రం పేలుడుకు కారణం ఇంకా తెలియరాలేదని స్పష్టం చేశారు. క్రాన్స్-మోంటానాలోని దవాఖానలు కాలిన గాయాలతో చేరిన రోగులతో నిండిపోయాయి. ఘటన జరిగిన తర్వాత దట్టమైన నల్లని పొగ బార్ నుంచి వెలువడుతున్న దృశ్యాలతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రాన్స్ మోంటానాపై విమానాలు ఎగరకుండా నిషేధం విధించినట్లు పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు. నాటకీయ పరిణామానికి దారితీసిన పరిస్థితులను నిర్ధారించడానికి అధికారులు దర్యాప్తును చేపట్టినట్లు స్విట్జర్లాండ్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పారు.