కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా (Kolkata)సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. నానమ్మ వద్ద నిద్రిస్తున్న నాలుగేండ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి హూగ్లీలోని తారకేశ్వర్‌లో ఉన్న రైల్వే షెడ్ వద్ద బంజారా తెగకు చెందిన నాలుగేండ్ల చిన్నారి తన నానమ్మతో కలిసి మంచంపై నిద్రిస్తున్నది. మంచానికి ఉన్న దోమతెరను కట్ చేసిన దుండగులు బాలికను ఎత్తుకెళ్లారు. తారకేశ్వర్ హై డ్రేయిన్ సమీపంలో ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం అక్కడే వదిలి వెళ్లారు. రక్తపు మడుగులో పడిఉన్న ఆ చిన్నారిని గుర్తించిన స్థానికులు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
బాలిక తన వద్ద పడుకున్నదని, తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమెను ఎత్తుకెళ్లారని బాధితురాలి నానమ్మ తెలిపారు. అయితే ఎవరు తీసుకెళ్లారో తనకు తెలియని చెప్పారు. దోమ తెరను కట్ చేసి తీసుకెళ్లారని, వివస్త్రగా తమకు దొరికిందని వెల్లడించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.