న్యూఢిల్లీ: రూ.4,078 కోట్ల ప్యాలెస్.. 700 కార్లు.. 8 ప్రైవేట్ విమానాలు.. ఇలా కండ్లు చెదిరే ఆస్తులతో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ రాజ కుటుంబం ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబంగా పేరు పొందింది. జీక్యూ కథనం ప్రకారం ఈ రాజ కుటుంబంలో 18 మంది అన్నదమ్ములు, 11 మంది అక్కచెల్లెళ్లు ఉన్నారు. వీరికి తొమ్మిది మంది పిల్లలు, 18 మంది మనవళ్లు ఉన్నారు. ప్రపంచంలోని చము రు నిల్వల్లో ఈ కుటుంబానికి 6 శాతం వాటా ఉంది. మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ యజమాని అయిన ఈ కుటుంబానికి ప్రముఖ బ్యూటీ కంపెనీ ఫెంటీ మొదలుకొని స్పేస్ ఎక్స్ వరకు వివిధ కంపెనీల్లో షేర్లున్నాయి. అబుధాబిలో ఈ కుటుంబం నివసించే అధ్యక్షుడి ప్యాలెస్ 94 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్యాలెస్లో ఖరీదైన కళాత్మక వస్తువులు, 350,000 క్రిస్టల్స్ పొదిగిన చాండ్లియర్ ఉన్నాయి. ఈ కుటుంబానికి లండన్, ప్యారిస్తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఖరీదైన ఆస్తులున్నాయి. 2015లో న్యూయార్కర్ మ్యాగజైన్ కథ నం ప్రకారం బ్రిటిష్ రాజ కుటుంబంతో పోల్చదగిన ఆస్తులు ఈ దుబాయ్ రాజ కుటుంబానికి ఉన్నాయి.