Mumbai | ముంబై, మే 13 (నమస్తే తెలంగాణ): భీకర గాలులు, అకాల వర్షంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై సోమవారం చిగురుటాకులా వణికింది. భీకరగాలులకు ఘాట్కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ పంప్‌పై కుప్పకూలగా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెట్రోల్ పంప్, హోర్డింగ్ శిథిలాల కింద 22 మంది చిక్కుకున్నారని బీఎంసీ అధికారులు తెలిపారు. సీఎం ఏక్నాథ్ షిండే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించారు.
క్రేన్లు, గ్యాస్ కట్టర్లతో శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని అధికారులు చెప్పారు. గాయపడ్డ 70 మందిని వివిధ దవాఖానలకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామని బీఎంసీ అధికారి ఒకరు చెప్పారు. కుప్పకూలిన హోర్డింగ్‌కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా అక్కడ ఏర్పాటుచేశారని బీఎంసీ కమిషనర్ భూషణ్ గాగ్రానీ చెప్పారు. భీకరమైన గాలివాన ధాటికి వడాలాలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కుప్పకూలింది. వెలుతురు సరిగా లేకపోవటంతో లోకల్ రైళ్లను, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పలు విమాన సర్వీసులను కొన్ని గంటలపాటు నిలిపివేశారు.