Internet ShutDown in Assam | అసోంలో వివిధ శాఖల్లో 27 వేల ఉద్యోగాల నియామక పరీక్షకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అసోం సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్లైన్లో మోసానికి పాల్పడకుండా పరీక్ష జరిగే సమయంలో ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో నాలుగు గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ పరీక్షలకు దాదాపు 14 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. కనుక పరీక్షలు జరిగే అన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవు.
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు అసోం సర్కార్ ప్రకటించింది. ఇన్విజిలేటర్లు కూడా తాము విధులకు హాజరయ్యే పరీక్షా కేంద్రాల లోపలకు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అనుమతించరు. ప్రతి పరీక్షా కేంద్రంలో పరీక్ష సమయంలో సంబంధిత కేంద్రం ఇన్చార్జి ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ చేస్తారు.
సజావుగా ఈ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ రాష్ట్రంలోని డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష నిర్వహణలో ఎటువంటి నిబంధనల ఉల్లంఘనకు తావివ్వరాదని అధికారులు ఆదేశించారు. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 11 వరకు గ్రేడ్-3, గ్రేడ్-4 పోస్టులకు తొలి దశ పరీక్ష జరుగనున్నది.