న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఓటరు జాబితాలో పేరు నమోదుకు ప్రతీ ఏడాది నాలుగు కటాఫ్ తేదీలను పెట్టాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయనున్నది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ పార్లమెంటులో వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే, అందులో ఓటు వేయడానికి యువకుడికి ఆ సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలి. అప్పుడే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనవరి 2న జన్మించినా కూడా మరుసటి సంవత్సరమే దరఖాస్తు చేసుకోవాలి. దీంతో అనేక మంది అర్హులు ఓటు హక్కు కోల్పోతున్నారని ఎన్నికల కమిషన్ పలుమార్లు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే సంవత్సరానికి నాలుగు కటాఫ్ తేదీలు పెట్టాలని కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదించింది. ‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 14(బీ)కి సవరణ చేయాలని ప్రతిపాదించాం. ఓటరు జాబితాలో పేరు నమోదుకు నాలుగు కటాఫ్ తేదీలు(జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) పెట్టాలని నిర్ణయించాం. దీనిపై సమగ్రమైన క్యాబినెట్ నోటు సిద్ధం అవుతున్నది’ అని లోక్సభకు తెలిపింది. ఓటరు జాబితాలో సంస్కరణలపై న్యాయ, సిబ్బంది వ్యవవహారాల పార్లమెంటరీ కమిటీ శుక్రవారం లోక్సభకు 109వ రిపోర్టును సమర్పించింది. ఈ సందర్భంగా కేంద్రం ఓటరు జాబితాపై వివరణ ఇచ్చింది.