న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ర్టాలకు నిధుల కేటాయింపులో సవతి ప్రేమ చూపిన మోదీ ప్రభుత్వ వైఖరిపై ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27న ప్రధాని అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కారాదని నలుగురు సీఎంలు నిర్ణయించారు. ఇందులో ముగ్గురు కాంగ్రెస్ సీఎంలు ఉన్నారు.
తాము నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం సాయంత్రం ప్రకటించగా, బడ్జెట్లో ప్రతిపక్ష రాష్ర్టాలపై మోదీ చూపిన వివక్షపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ పార్టీ ముఖ్యమంత్రులు ముగ్గురు ఈ సమావేశానికి హాజరు కారని స్పష్టం చేశారు. కాగా, బడ్జెట్లో కేంద్రం చూపిన వైఖరిపై బెంగాల్, కేరళ ము ఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసి నా, వారు నీతి ఆయోగ్ సమావేశం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
కేంద్ర బడ్జెట్లో తమిళనాడును పూర్తిగా విస్మరించారు. మోదీ సర్కారు తీరుకు నిరసనగా ఈ నెల 27న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా. కేంద్ర బడ్జెట్‌పై డీఎంకే ఎంపీలు ఈ నెల 24న ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తారు. తమిళనాడు హక్కులను పరిరక్షించుకునేందుకు ప్రజాకోర్టులోనే పోరాడుతాం. లోక్‌సభలో తగినంత సంఖ్యాబలం లేని ‘మైనార్టీ బీజేపీ’ని ‘మెజార్టీ బీజేపీ’గా మార్చిన కొన్ని ప్రాంతీయ పార్టీలను సంతృప్తి పరిచేందుకు బడ్జెట్లో కేవలం కొన్ని రాష్ర్టాలకే పథకాలను ప్రకటించారు. -తమిళనాడు సీఎం స్టాలిన్