పాట్నా: చిత్రహింసలకు గురైన నలుగురు బాలురు ఒక మదర్సా నుంచి తప్పించుకున్నారు. కాళ్లకు సంకెళ్లు ఉన్న ఆ పిల్లలను గ్రామస్తులు గమనించారు. ఆరా తీయగా తమ బాధలను వారు చెప్పుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ మదర్సా నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. (boys with chains escape from madrasa) బీహార్లోని దర్భంగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మదర్సాలో చదువుతున్న కొందరు బాలురు అక్కడి వేధింపులు తాళలేక తప్పించుకున్నారు. ఎండలో నడిచి ఒక గ్రామానికి చేరుకున్నారు.
కాగా, ఒక చెట్టు కింద సేద తీరుతున్న నలుగురు బాలుర కాళ్లకు గొలుసులు ఉండటాన్ని కొందరు గ్రామస్తులు గమనించారు. వారి వద్దకు వెళ్లి ఆరా తీశారు. అలసిపోయి తీవ్ర ఆందోళనతో ఉన్న ఆ పిల్లలకు ఆహారం, తాగు నీరు అందించారు. తాము మధుబని జిల్లాకు చెందినవారమని, దర్భంగాలోని ఒక మదర్సాలో ఉంటూ చదువుకుంటున్నట్లు ఆ పిల్లలు తెలిపారు.
మరోవైపు మదర్సాలో తమ దుస్థితిని స్థానికులకు ఆ బాలురు వివరించారు. మదర్సా నిర్వాహకుడైన మౌలానా ఖాదిర్ తమను శారీరకంగా హింసించినట్లు ఆరోపించారు. తమను తరచుగా కొట్టేవాడని, మానవ వ్యర్థాలను చేతితో శుభ్రం చేయమని బలవంతం చేసినట్లు ఆరోపించారు. తాము ఆ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లకుండా తమ కాళ్లకు సంకెళ్లు వేసి తాళాలు వేసినట్లు తెలిపారు. మౌలానా తమను పదేపదే కొట్టడం వల్ల తమ శరీరాలపై గాయాలయ్యాయని వారు చెప్పారు.
ఆ ముస్లిం పిల్లల దుస్థితి గురించి తెలుసుకున్న గ్రామస్తులు స్థానిక పోలీసులు, చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. నలుగురు పిల్లల వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ బాలురను శిశు సంరక్షణ గృహానికి తరలించారు. పిల్లలను వేధించి హింసించిన మదర్సా నిర్వాహకుడు మౌలానా ఖాదిర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.