ముంబై: అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టినా దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా యథేచ్చగా కొనసాగుతూనే ఉన్నది. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరిలో నిషేధిత డ్రగ్ ఎఫిడ్రిన్ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి ముంబై మీదుగా ఆస్ట్రేలియాకు తరలించే క్రమంలో మహారాష్ట్రకు చెందిన నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడిన ఎఫిడ్రిన్ 4.600 కేజీల బరువు ఉన్నదని అధికారులు తెలిపారు.
ఈ ఎఫిడ్రిన్ అనే డ్రగ్‌ను కొన్ని అత్యవసర సందర్భాల్లో వైద్య చికిత్సల్లో ఉపయోగించేందుకు అనుమతి ఉన్నది. ఈ డ్రగ్ ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. అందుకే వెన్నుకు మత్తుమందు ఇచ్చిన సమయంలో పేషెంట్లో రక్త ప్రసరణ లెవల్స్ పడిపోకుండా ఉండటం కోసం ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ఆస్తమా రోగులకు, ఊబకాయ సమస్యకు చికిత్స తీసుకుంటున్న వారికి కూడా ఈ ఔషధాన్ని ఇస్తారు.