Encounter | కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 4: పచ్చటి ప్రకృతిలో తుపాకులు గర్జించాయి. నట్టడివిలో నెత్తుటేర్లు ప్రవహించాయి. ఆయువుపట్టు లాంటి దండకారణ్యంలో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శుక్రవారం భీకర పోరాటం జరిగింది. పోలీసుల తూటాలకు పెద్ద ఎత్తున సాయుధ నక్సలైట్లు ప్రాణాలు విడిచారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండూర్ – తులతులీ గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల పోలీసులు, డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు గురువారం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలు – మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇరువైపులా సుమారు ఏడు సార్లు కాల్పులు జరిగినట్లు సమాచారం. మూడు గంటల భీకర పోరు తరువాత జవాన్ల తాకిడిని తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారు. కాల్పులు ముగిసిన అనంతరం ఘటనా స్థలాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చేపట్టగా, 36 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మావోయిస్టులకు చెందిన అధునాతన ఆయుధాలు, ఇతర సామగ్రిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన దంతేవాడ – నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులు పీఎల్జీఏ 5, 6 కంపెనీలకు చెందిన సభ్యులుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. 150 మందికి పైగానే సాయుధ మావోయిస్టులు ఎన్కౌంటర్లో పాల్గొన్నట్టు తెలుస్తున్నది. 36 మంది మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు చెబుతున్నప్పటికీ 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. అయితే, ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. వరుస ఎన్కౌంటర్లతో నష్టపోతున్న మావోయిస్టులకు తాజా ఘటన పెద్ద ఎదురుదెబ్బ.
ఈ కాల్పుల్లో ఒక కంపెనీ మొత్తాన్ని భద్రతా దళాలు తుడిచిపెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ అదే జరిగితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరికొందరు మావోయిస్టులు బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నారని, పలువురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తున్నది. ఈ ఘటన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు సరిహద్దుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాయి.
మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్ ‘కగార్’ వేగంగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో భద్రతా దళాలు ఏకపక్షంగా పైచేయి సాధిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లలో 185 మందికి పైగానే మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మహిళా మావోయిస్టుల సంఖ్య కూడా 40కి పైనే ఉంది. తాజా ఎన్కౌంటర్లో ఎంతమంది మహిళా మావోయిస్టులు ఉన్నారనేది తెలియాల్సి ఉంది.
ఈ ఎన్కౌంటర్ భారీ ఆపరేషన్ అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ పేర్కొన్నారు. నక్సలిజం తుదిశ్వాస తీసుకుంటున్నదని, రాష్ట్రం నుంచి నక్సలిజాన్ని పారదోలతామని పేర్కొన్నారు. ఇందుకోసమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత తొమ్మిది నెలల్లో రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించారని, 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు.