Uttar Pradesh | లక్నో, జూన్ 14: ఉత్తరప్రదేశ్‌లో 1994లో జరిగిన ఒక దాడి కేసులో ఎట్టకేలకు 30 ఏండ్ల తర్వాత స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులకు కేవలం రూ.2 వేల జరిమానా విధించి కేసును ముగించింది. యూపీలోని కమసిన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1994లో రామ్‌రూప్ శర్మ అనే వ్యక్తిపై అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. మద్యానికి అలవాటు పడిన నిందితులు.. రామ్రూప్ను బంధించి, దాడి చేయడంతో పాటు డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు కావడం, చార్జ్‌షీట్ దాఖలు చేయడం కూడా అప్పట్లోనే జరిగిపోయాయి.
అయితే, కోర్టులో మాత్రం కేసు ఏండ్ల తరబడి కొనసాగింది. వందల సార్లు కేసు వాయిదా పడింది. ఈ క్రమంలో 15 మంది న్యాయమూర్తులు మారారు. అయినా రామ్‌రూప్ తన న్యాయపోరాటాన్ని కొనసాగించారు. చివరకు జూన్ 13న యూపీలోని బండ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ దాడికి పాల్పడ్డ ముగ్గురిలో ఒకరు ఇప్పటికే మరణించగా మిగతా ఇద్దరికి చెరో రూ.2 వేల జరిమానాను కోర్టు విధించింది. నేర వృత్తిలో ఉన్న నిందితులపై అనేక కేసుల్లో నేరాలు రుజువయ్యాయని, ఇంత చిన్న శిక్ష వారిపై ప్రభావం చూపదని బాధితుడు వాదించినప్పటికీ లాభం లేకుండా పోయింది. కాగా, ఘటన జరిగినప్పుడు 40 ఏండ్ల వయస్సున్న బాధితుడి వయస్సు ఇప్పుడు 70 ఏండ్లు. అప్పుడు యువకులుగా ఉన్న నిందితులు ఇప్పుడు వృద్ధాప్యానికి చేరువగా ఉన్నారు.