ఇంఫాల్, సెప్టెంబర్ 12: మణిపూర్లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. తాజాగా కాంగ్పోక్పి జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు గిరిజనులను కాల్చిచంపారు. కంగుయ్ ఏరియాలోని ఇరేంగ్, కరం వైఫీ గ్రామాల మధ్య మంగళవారం ఉదయం సమయంలో ఈ దాడి జరిగిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. దాడి ఘటనను కమిటీ ఆన్ ట్రైబల్ యూనిటీ(సీవోటీయూ) తీవ్రంగా ఖండించింది. కేంద్రం వెంటనే రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను నెలకొల్పాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. శాంతియుత పరిస్థితులను నెలకొల్పే విషయంలో కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. రాష్ట్రంలోని అన్ని లోయ జిల్లాలను కల్లోల ప్రాంతాలుగా ప్రకటించి, వెంటనే భద్రతా బలగాల(ప్రత్యేక అధికారాల) చట్టం -1958ని అమలు చేయాలని పేర్కొన్నది. మరోవైపు జాకెట్స్, చొక్కాలు, స్టిక్కర్లపై ‘ప్రెస్’ అనే పద వినియోగం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.