Terrorist attacks in Kashmir | జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం సాయంత్రం మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. శ్రీనగర్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు జరిపిన మొదటి దాడిలో ఓ పౌరుడు మరణించాడు. శ్రీనగర్‌లోనే జరిగిన మరో ఘటనలో మరో పౌరుడికి గాయాలు అయ్యాయి. అనంతరం అనంతనాగ్ జిల్లాలోని సీఆర్పీఎఫ్ బంకర్‌పై గ్రనేడ్లు విసిరారు. అయితే ఎటువంటి నష్టం జరుగలేదని వార్తలొచ్చాయి.
తొలి ఘటన సాయంత్రం 5.50 గంటలకు జరిగింది. శ్రీనగర్‌లోని చత్తాబాల్ నగర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మజీద్ అహ్మద్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స కోసం సమీప దవాఖానలో చేర్చగా, చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.
రాత్రి ఎనిమిది గంటల సమయంలో బాటామాలూ ఎస్డీ కాలనీలో జరిగిన రెండో ఘటనలో మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో మహమ్మద్ షఫీ ధర్ గాయపడ్డాడు. దీంతో చికిత్స కోసం దవాఖానకు తరలించారు. అంతకుముందు 6.50 గంటలకు అనంతనాగ్‌లోని 40వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ బంకర్‌పై విసిరిన గ్రనేడ్ పేలలేదు. ఈ దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.