ఖమ్మం, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో గురువారం జరిగింది. గుండ్రాతిగూడెం-పల్లిగూడెం అడవుల్లో భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగారు. ఇరువర్గాల మధ్య రెండు గంటల వ్యవధిలో రెండు, మూడుసార్లు ఎదురు కాల్పులు జరిగాయి. కాసేపటికి జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. ఘటనా స్థలం నుంచి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు తుపాకులు, ఇతర మారణాయుధాలు, వస్తు సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో క్యాడర్ ఉన్న మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.