Spying | పాక్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా ఉగ్రవాదులతో సంబంధాలు (Terror Links) ఉన్న పలువురు ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees)పై జమ్ము కశ్మీర్ ప్రభుత్వం వేటు వేసింది.
పోలీస్ కానిస్టేబుల్ ఇష్ఫాక్ నసీర్, స్కూల్ టీచర్ అజాజ్ అహ్మద్ , ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్‌ఖాన్.. ఈ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Lieutenant Governor Manoj Sinha) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు ఉద్యోగులకు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరు ఉగ్రవాదులకు సరకులు అందజేయడం, ఆయుధాల స్మగ్లింగ్, భద్రతా దళాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు సాయం చేయడం వంటివి చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ముగ్గురుని అధికారులు జైలుకు తరలించారు.
ఇష్ఫాక్ నసీర్.. 2007లో రాష్ట్ర పోలీసు శాఖలో చేరాడు. అతని సోదరుడు ఆసిఫ్ నసీర్ 2019లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మరణించాడు. అతను పాక్‌లో శిక్షణ పొందిన లష్కరే తోయిబా ఉగ్రవాది. ఆయుధాల అక్రమ రవాణా కేసు దర్యాప్తు సందర్భంగా అతని ఉగ్రవాద సంబంధాలు బయటపడ్డాయి. అతని మరణంతో ఇష్ఫాక్ నసీర్ ఉగ్రకార్యకలాపాలను కొనసాగించాడు. లష్కరే తోయిబాకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు సరఫరాకు సాయం చేసేవాడు.
అజాజ్ అహ్మద్.. 2011లో విద్యాశాఖలో టీచర్‌గా ఉద్యోగంలో చేరాడు. అతడికి హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయి. కశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో చురుగ్గా పనిచేస్తూ ఉగ్రవాదులకు ఆయుధాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసేందుకు సాయం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2023లో పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో అతడు, అతడి మిత్రుడు దొరికిపోయారు. అతడికి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని హిజ్బుల్ హ్యాండ్లర్ నుంచి ఆయుధాలు వచ్చినట్లు గుర్తించారు. వాటిని డెలివరీ చేసేందుకు వెళుతుండగా.. పోలీసులు పట్టుకున్నారు. అతని నుండి హిజ్బుల్ పోస్టర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
వసీమ్ అహ్మద్ ఖాన్.. 2007లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరాడు. ప్రస్తుతం అతను శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు లష్కరే, హిజ్బుల్ ఉగ్ర సంస్థల కోసం పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతడికి ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్లు 2018లో ఆగస్టులో బయటపడింది. శ్రీనగర్‌లోని బట్మాలూ వద్ద ఉగ్రదాడిపై విచారణ సమయంలో ఇతడిని తొలిసారి అరెస్ట్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ సుజాత్ బుఖారీ, అతని ఇద్దరు గార్డుల హత్యకు కుట్రలో ఇతడి హస్తం ఉంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఘటనా స్థలం నుంచి తప్పించేందుకు ఇతడే సాయం చేసినట్లు గుర్తించారు.
Also Read..
Northeastern States | మిజోరాంలో వర్షబీభత్సం.. 552 చోట్ల విరిగిపడ్డ కొండచరియలు.. దెబ్బతిన్న 152 ఇళ్లు
Kamal Haasan | సత్యం ఎన్నటికీ తల వంచదు.. కన్నడ భాషపై వివాదం వేళ కమల్ హాసన్‌కు మద్దతుగా పోస్టర్లు