కాసరగోడ్: కేరళలోని కాసరగోడ్ జిల్లాలో వీరర్కవు ఆలయంలో (Veerarkavu Temple) జరిగిన పటాకుల పేలుళ్ల ఘటనలో దేవాలయ కమిటీ చైర్మన్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి నీలేశ్వరం సమీపంలోని వీరర్కవు దేవాలయంలో ప్రజలు తెయ్యం ప్రదర్శన చూస్తుండగా, అక్కడ నిల్వ ఉంచిన పటాకులు ఒక్కసారిగా పేలాయి. దీంతో జరిగిన తొక్కిసలాటలో 150 మంది గాయపడ్డారు. వారిలో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీకి చెందిన ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. వారిలో అధ్యక్షుడు చంద్రశేఖరన్తోపాటు కార్యదర్శి భరతన్ సహా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.
తెయ్యం లేదా కాళియాట్టం అనేది ఉత్తర కేరళ ప్రాంతంలోని ఆలయాల్లో నిర్వహించే పురాతన కళా ప్రదర్శన. ఇందులో భాగంగా వీరర్కవు దేవాలయంలో సోమవారం రాత్రి తెయ్యం ఉత్సవం జరుగుతుండగా ప్రమాదం జరిగింది. ఉత్సవాల కోసం ఆలయ ప్రాంగణంలోని ఓ రేకుల షెడ్డులో పెద్ద ఎత్తున బాణసంచా నిల్వ ఉంచారు. ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు తెయ్యం ప్రదర్శన చూస్తుండగా ఆ షెడ్డులో పేలుడు సంభవించింది. పేలుడు శబ్దంతో జనం ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. కాగా, భద్రతకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. తెయ్యం ప్రదర్శనకు, టపాసుల నిల్వకు కనీసం 100 మీటర్ల దూరాన్ని పాటించాలన్న నిబంధనను పాటించలేదన్నారు. పటాకుల నిల్వకు అనుమతి తీసుకోలేదని చెప్పారు.