Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. మొహర్రం సందర్భంగా ఏర్పాటు చేసిన తజియా.. హైటెన్షన్ వైర్లకు తగలడం వల్ల విద్యుత్ షాక్‌తో ముగ్గురు మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన రాట్లం జిల్లాలోని హత్నారా గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. హత్నారా గ్రామంలో శుక్రవారం మొహర్రం సందర్భంగా తజియా ఊరేగింపు జరిగింది. తజియా చాలా ఎత్తుగా ఉంది. ఈ తజియాతో మొహర్రం ఊరేగింపు నిర్వహిస్తుండగా పైన ఉన్న 11 కేవీ హైటెన్షన్ వైర్లను తగిలింది.
తజియా పైభాగం ఆ వైర్లను తగలడం వల్ల దీన్ని తీసుకెళ్తున్న 12 మందికి విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో అక్కడ గందరగోళ, భయానక వాతావరణం ఏర్పడింది. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, స్థానిక అధికారులు విద్యుత్ షాక్‌కు గురైన 12 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు మృతులను రషీద్ ఖాన్, సద్దు హుస్సేన్, అర్బాజ్ ఖాన్‌గా గుర్తించారు. గాయపడ్డ తొమ్మిది మందికి రాట్లం మెడికల్ కాలేజీలో చికిత్స అందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ఈ ప్రమాదంపై స్థానిక ప్రజలు, ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తు్న్నారు. ప్రతి ఏడాది గ్రామంలో ఇదే మార్గంలో మొహర్రం తజియా వెళ్తుందని, ఈ సమయంలో విద్యుత్ అధికారులు విద్యుత్ నిలిపివేస్తారని, సిబ్బంది కూడా తమతోనే ఉంటారని చెప్పారు.
ఈ ఏడాది కూడా విద్యుత్ సిబ్బంది తమతోనే ఉన్నారని, కానీ, విద్యుత్ సరఫరా నిలిపివేయలేదని, అందువల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా దీనిపై స్పందించారు. ప్రమాదకరమైన విద్యుత్ తీగలు గ్రామం మధ్య నుంచి వెళ్తున్నాయని, అందులోనూ అవి చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయని విమర్శిస్తున్నారు. కొన్నిసార్లు బస్సులు, ఇతర వాహనాలు వెళ్లేందుకు కూడా వీటివల్ల ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి వీటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.