Puri Jagannath Temple | వేదాలు, పురాణాలు పూర్తిగా పారాయణం చేసి ఉపనయనం పూర్తయిన బ్రాహ్మణ యువకుడినే పూజారిగా నియమించుకుంటారు. కానీ దేశంలోనే ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ ఆలయంలో పరిస్థితి వేరు. బాలాదేవ్ దాస్మోహపాత్ర, ఏకాంశు దాస్మోహపాత్రలు ఏడాది లోపు వయస్సు ఉన్న పసి కందులే. కానీ పూరీ జగన్నాథ ఆలయంలో పూజారిగా సేవలందించేందుకు నియమించుకున్నారు. వారికి వార్షిక వేతనం కూడా రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు ఉంటుందట.
పది నెలల బాలదేవ్, ఏడాది వయస్సు గల ఏకాంశు, మరో బాలుడిని బుధవారం అధికారికంగా జగన్నాథ దేవాలయ పూజారులుగా నియమించారు. డైటాపాటి నిజోగ్ సామాజిక వర్గానికి చెందిన పూజారులు.. పూరీ జగన్నాథ రథయాత్రలో కీలక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో దేవస్నాన్ పూర్ణిమ పండుగ సందర్భంగా ఈ నెల నాలుగో తేదీన సదరు ముగ్గురు బాలలు ఆలయ గర్భగుడిలోనే ఉండిపోయారు. నాటి నుంచి ప్రత్యేక పూజలు చేస్తూ వచ్చారు. కానీ పూజల తర్వాత వారు అనారోగ్యానికి గురయ్యారు.
డైటాపాటి నిజోగీ సామాజిక వర్గ పూజారులకు కొడుకు పుడితే, వారితో రథయాత్రకు 15 రోజుల ముందు గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తారు. 21 రోజులు వయస్సు దాటితే చాలు.. ఆ పసి కందులు పూజారులుగా పూజలు చేయడానికి అర్హులని డైటాపాటి పూజారి, జగన్నాథ టెంపుల్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు దుర్గా దాస్మోహపాత్ర చెప్పారు. అయితే, వారంతా 18 ఏండ్లు దాటిన తర్వాతే పూజారులుగా సేవలు ప్రారంభిస్తారు.