లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న సరయూ నదిలో కొందరు యువకులు పడవలో షికారు చేశారు. అందులో మాంసం తినడంతో పాటు మద్యం సేవించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. (Ayodhya) అయోధ్యలోని గుప్తార్ ఘాట్ వద్ద నలుగురు యువకులు పడవపై నదిలో విహరించారు. పవిత్ర నదిలోని పడవలో వారు మాంసం తినడంతో పాటు మద్యం సేవించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో దీనిపై పోలీసులు స్పందించారు. ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. నిందితులను లవ్కుష్ నిషాద్, జితేంద్ర నిషాద్, రాజ్‌కుమార్ నిషాద్గా గుర్తించారు. నదిని పవిత్రంగా భావించే భక్తుల విశ్వాసానికి భంగం కలిగించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.