చెన్నై: తమిళనాడులో జల్లికట్టు (Jallikattu) క్రీడలు మొదలయ్యాయి. ఆరంభంలోనే 29 మంది వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది జనవరిలో జల్లికట్టు నిర్వహిస్తారు. పరుగెత్తే పశువులను పట్టుకుని నిలువరించేందుకు యువకులు ప్రయత్నిస్తారు. అలాగే గ్రౌండ్లో ఎద్దులను లొంగదీసుకుని వాటిపై ఆధిపత్యం చెలాయించేందుకు పోటీపడతారు. తాజాగా పుదుక్కోట్టై జిల్లాలో జల్లికట్టు క్రీడలు ఆరంభించారు. అయితే ఈ పోటీ సందర్భంగా రోటీన్‌గా రక్తం చిందింది. పశువులను నియంత్రించేందుకు ప్రయత్నించిన వారిలో 29 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని తంజావూరు మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
కాగా, సాంప్రదాయ గ్రామీణ క్రీడ అయిన ఎద్దులను మచ్చిక చేసుకునే జల్లికట్టులో యువకులు పెద్ద సంఖ్యలో గాయపడుతుంటారు. అలాగే పశువులకు హాని కలిగిస్తున్నారన్న ఆరోపణలతో జల్లికట్టును నిషేధించాలంటూ జంతు హక్కుల సంస్థ పెటాతోపాటు కొందరు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే జల్లికట్టును సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది మే నెలలో చారిత్రక తీర్పు ఇచ్చింది. అదే సమయంలో పశువుల పట్ల ఎలాంటి హింస జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.