కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై కేంద్రం రూ.28,655 కోట్ల నికర రాయితీని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి కాలానికి ఫాస్పేట్, పొటాష్ ఎరువులకు పోషకాధార రాయితీ (ఎన్బీఎస్) ధరలను కూడా క్యాబినెట్ ఆమోదించింది. ఎన్బీఎస్ కింద కిలో నైట్రోజన్ సబ్సిడీ రేటు రూ.18.789, ఫాస్పరస్ రూ.45.323, పొటాష్ రూ.10.116, సల్ఫర్ రూ.2.374గా నిర్ణయించారు.
డీఏపీపై అదనపు రాయితీ
ఖరీఫ్ సీజన్ కోసం జూలైలో పెంచిన ఎన్బీఎస్ రేటును వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే ప్రత్యేక వన్-టైమ్ ప్యాకేజీ ద్వారా డీఏపీపై రూ.6,500 కోట్ల అదనపు రాయితీని కల్పించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. యూరియా తర్వాత డీఏపీ వినియోగం ఎక్కువ.