జైపూర్: రాజస్థాన్‌లోని ఇద్దరు అన్నదమ్ములు సుభాశ్ బిజరాని, రణవీర్ బిజరానీ దాదాపు 70,000 మందిని మోసం చేసి, రూ.2,676 కోట్ల మేరకు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సికర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ నెక్సా ఎవర్గ్రీన్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. పెట్టుబడులపై అత్యధిక లాభాలను చెల్లిస్తామని, గుజరాత్‌లోని ‘ధొలేరా స్మార్ట్ సిటీ’లో ఫ్లాట్స్, స్థలాలు ఇస్తామని ఆశపెట్టి మదుపరులను నిండా ముంచేశారు.
మదుపరులకు ఈ సిటీలోని ఆకర్షణీయమైన ప్రాజెక్టుల బొమ్మలను చూపించారు. రకరకాల టార్గెట్లను పెట్టి, ఒక్కొక్క స్థాయి టార్గెట్‌ను సాధిస్తే ఒక్కొక్క విధంగా లాభం పొందవచ్చునని ఆశపెట్టారు. లాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్లు వంటివాటిని బహుమతిగా ఇస్తామని ఎర వేశారు. ఒక పెట్టుబడిదారు మరికొందరి చేత పెట్టుబడి పెట్టిస్తే, ఇంకా ఎక్కువ బహుమతులు, కమిషన్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
సుభాశ్ సైన్యంలో పని చేసి, రిటైర్ అయ్యాడు. వీరిద్దరూ సైన్యంలోని ఉన్నతాధికారులను కూడా ఈ రొంపిలోకి దించారు. వారి ద్వారా రాజస్థాన్‌లో వందలాది మంది ఏజెంట్లను నియమించుకున్నారు. మొత్తం మీద వీరిద్దరూ రూ.1,500 కోట్ల మేరకు కమీషన్లు చెల్లించారు. దాదాపు 800 ఎకరాల భూమిని కొన్నారు. రాజస్థాన్‌లో విలాసవంతమైన కార్లు, గనులు, హోటళ్లను సొంతం చేసుకున్నారు. గోవాలో 25 రిసార్టులను కొన్నారు. రూ.250 కోట్ల నగదును 27 డొల్ల కంపెనీల్లోకి బదిలీ చేశారు. ఈ మోసం బయటపడేసరికి వీరు కార్యాలయాలను మూసేసి, పరారైపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం జైపూర్, సికర్, ఝుంఝును, అహ్మదాబాద్‌లలో 25 చోట్ల సోదాలు నిర్వహించారు.