లక్నో: విష వాయువులు పీల్చడంతో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. (Students Face Breathing Issues) ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తమ్కుహిరాజ్ తహసీల్ ప్రాంతంలోని గ్రీన్‌ల్యాండ్ పబ్లిక్ స్కూల్ సమీపంలో చెత్తను కాల్చారు. వ్యర్థాలు మండటంతో విష వాయువులు వెలువడ్డాయి. ఆ స్కూల్ ప్రాంగణంలోకి అవి వ్యాపించాయి.
కాగా, ఆ విష వాయువులు పీల్చిన విద్యార్థులకు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తాయి. కొందరు పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అస్వస్థత చెందిన బాధిత విద్యార్థులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి ప్రాథమిక చికిత్స అందించారు. కొందరు విద్యార్థులు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు.
మరోవైపు తీవ్ర ఇబ్బందికి గురైన 11 మంది విద్యార్థులను కుషినగర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత వారిని కూడా డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, విద్యా, ఆరోగ్య శాఖ అధికారులు ఆ స్కూల్‌తో పాటు ఆసుపత్రిని సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.